అదానీ కంపెనీని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఎంతకు అమ్ముడైపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ పి.అప్పల నర్స డిమాండ్ చేశారు. శనివారం గిరిజన సంఘం, అఖిల పక్షం తలపెట్టిన యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక బంద్ నేపథ్యంలో విశాఖపట్నం , చింతపల్లి మండల కేంద్రంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద గిరిజనులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఆదివాసీలు భయాందోళనకు గురి కావాల్సి వస్తున్నదన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే సర్వం కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళనతో యర్రవరం గ్రామానికి చెందిన భూపతిరాజు గుండెపోటుతో మరణించారని చెప్పారు. నరేంద్ర మోదీ తన మిత్రుడు అదానీకి, జగన్మోహన్ రెడ్డి వైసీపీ విజయానికి డబ్బు సహాయం చేసిన విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్ కంపెనీకి యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును అప్పగించారని ఆరోపించారు.