నెల్లూరు జిల్లా, సీతారామపురం, మండలంలో వైసీపీ నేతల చేష్టలతో పార్టీ ప్రతిష్ఠ రోజురోజుకి దిగజారుతోందని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కొడవలూరి ధనుంజయరెడ్డి ఎదుట వాపోయారు. శనివారం మండలంలో పర్యటనకు వచ్చిన పరిశీలకుడు పలు గ్రామాలకు చెందిన ఆ పార్టీ నేతలను కలుసుకున్నారు. అందులో భాగంగా బిట్-1 ఎంపీటీసీ పీసీ అల్లూరురాజు నివాసంలో వైసీపీలోని అసమ్మతి వర్గం నాయకులు, కార్యకర్తలతో పార్టీ పటిష్టతపై సమీక్షించారు. ఈ క్రమంలో మండలంలో పార్టీ పరిస్థితి ఏమిటి? ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ అడగడంతో పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో వైసీపీలోనే రెండు గ్రూపులున్నాయని.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కేవలం ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారని, మిగిలిన వారికి మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికారంలో ఉండి కూడా పనులు చేయించుకోలేక పోతున్నామంటూ పలువురు ముఖ్య నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.