వైసీపీ పాలనలో రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు చీకటి రోజులు ప్రారంభమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. భారత్ జోడో యాత్ర - ఇంటింటికి కాంగ్రెస్ యాత్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నెల్లూరు జిల్లా, కలువాయి మండలం చింతలాత్మకూరు, తోపుగుంట, బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లోని దళిత కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన 17వేల ఎకరాల భూములను ఈ ప్రభుత్వం గుంజుకుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ను ద్వారా దళితులకు రుణాలు పూర్తిగా ఆపేశారని, అలాగే ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు, ప్రమోషన్లు, కల్పించకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం శాశ్వతంగా నిలిపి వేసిందని, అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న పేదలకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. దళితులకు మంచి రోజులు మళ్లీ కాంగ్రెస్‌తోనే వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకుడు నిజమాల చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.