‘సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తాం. మా సంస్థలో చేరిన వారికి డిఫెన్స్‌లో ఉద్యోగం గ్యారెంటీ’ అంటూ నిరుద్యోగులకు వల వేసిన ఓ సంస్థ భారీగా డబ్బు దండుకొని బోర్డు తిప్పేసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన వి.కుమారస్వామి విజయనగరంలోని కొత్తపేటలో రెండేళ్ల క్రితం రక్ష డిఫెన్స్ అకాడమీ పేరిట శిక్షణ సంస్థను ప్రారంభించాడు. ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని ప్రచారం చేశాడు. అన్నింటికీ మించి తమ సంస్థలో చేరిన వారికి రక్షణ దళాల్లో ఉద్యోగం గ్యారెంటీ అని నమ్మబలికాడు. దీంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఈ శిక్షణ సంస్థలో చేరారు. ఉద్యోగం గ్యారెంటీ అంటూ ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశాడు. ఉద్యోగం రాకుంటే డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. ఇటీవల జరిగిన అగ్నిపథ్ నియామక ప్రక్రియలో ఈ సంస్థ నుంచి ఆరుగురు ఎంపికైనట్లు బాధితులు చెబుతున్నారు. మిగిలిన వారికి డబ్బు తిరిగిచ్చేస్తానంటూ అప్పటి నుంచి వి.కుమారస్వామి వాయిదాలు వేస్తూ వచ్చాడు. అతను చెప్పిన ప్రకారం బుధవారం డబ్బు కోసం వచ్చిన బాధితులకు కుమారస్వామి కనిపించలేదు. సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో మోసపోయామంటూ బాధితులు విజయనగరం టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. 160 మంది అభ్యర్థులున్నట్టు బాధితులు చెబుతున్నారని, కానీ స్టేషన్‌కు 30 మంది మాత్రమే వచ్చారని సీఐ లక్ష్మణరావు చెప్పారు. వారి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలిస్తామని, ఇంకా ఎంతమంది బాధితులున్నారో విచారించి కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.