పల్నాడు జిల్లా, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పై జరుగుతున్న దాడులు గురించి సత్య సాయి జిల్లా ఎస్పీ ని కలిసి తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి. కె. పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, పుట్టపర్తి పట్టణ కన్వినర్ రామాంజినేయులు, ఐ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రామాంజినేయులు తదితరులు జిల్లా అదనపు ఎస్ పి కి వినతి పత్రం అందజేశారు.
అనంతరం మీడియాతో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శాంతిభద్రతల రోజురోజుకు క్షీణిస్తున్నాయన్నారు. దీనిపై గతంలో ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞాపనలు సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇటీవల మాచర్లలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే కొందరు పోలీసు అధికారులు. అధికార వైసిపి గూండాలకు వత్తాసుపలుకుతూ ప్రజాస్వామ్యానికి తూట్లుపొడుస్తున్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు.
టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మానంద రెడ్డిపై తప్పుడు కేసు పెట్టేందుకు పోలీసులు ముందస్తు ప్రణాళికతో 2022 డిసెంబర్ 16వ తేదీ శుక్రవారం ఉదయం గుండ్లపాడు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారని, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాచర్ల పట్టణంలోని 13, 14వ వార్డులలో అధికార వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, ఈ నేపథ్యంలో టిడిపి తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికార వైఎస్సార్సీపీ గూండాలు హఠాత్తుగా మారణాయుధాలతో టీడీపీ మద్దతుదారులపై దాడి చేశారన్నారు. ఈ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆ తర్వాత టిడిపి నాయకులు, కార్యకర్తలపై వైసిపి గూండాలు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారన్నారు. ముందస్తు కుట్రలో భాగంగానే జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని మాచర్ల నుంచి బలవంతంగా గుంటూరు పంపించారన్నారు.
ఆ వెనువెంటనే మాచర్ల పట్టణంలో వైఎస్సార్‌సీపీ గూండాలు టీడీపీ కార్యాలయంతోపాటు ఇన్ చార్జి బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడి చేసి తగులబెట్టి బీభత్సం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల వాహానాలకు వైఎస్‌ఆర్‌సీపీ గూండాలు నిప్పుపెట్టడంతోపాటు టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. టిడిపి నేత యర్రంపోలి రెడ్డి ఇంటికి ధ్వంసం చేసి నిప్పంటించడమేగాక ఆయన ఇంటిలో చొరబడి 15సవర్ల బంగారం, లక్షరూపాయల నగదు లూఠీచేశారని, టీడీపీ నాయకుడు కొమరదుర్గారావు కారుకు నిప్పు పెట్టారని మరికొంతమంది టీడీపీ నాయకులు, మద్దతుదారులకు చెందిన పలు దుకాణాలను, ఇళ్లను కూడా ధ్వంసం చేశారన్నారు. ఇదంతా వైఎస్సార్‌సీపీ గూండాలు, పోలీసుల సహకారంతోనే జరుగుతున్నట్లు సంఘటన జరిగిన విధానాన్ని బట్టి తెలుస్తోందన్నారు.
అంతేకాకుండా మాచర్ల పట్టణంలో వైఎస్సార్‌సీపీ గూండాలు వీధుల్లోకి వెళ్లే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశారని పరిస్థితిని అదుపులోకి తేవాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, డీజీపీ, ఇతర పోలీసు అధికారులతో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఎవరూ స్పందించకపోవడం బాధాకరం అన్నారు. మాచర్లలో జరిగిన ఘటన పోలీసుల ఘోర వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తోందని, వైఎస్సార్‌సీపీ గూండాల గుంపును నియంత్రించడానికి బదులుగా పోలీసులు టీడీపీ నాయకుడిని అదుపులోకి తీసుకొని మాచర్ల పట్టణం నుండి బలవంతంగా బయటకు పంపడం దారుణం అన్నారు. రాష్ట్రంలో పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి అసాంఘిక శక్తుల చర్యలను అడ్డుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్జప్తి చేస్తోందని తెలిపారు.