కొత్తూరు మండలం మెట్టూరు సమీపంలో ఉన్న గిరిజనుల సాగులో ఉన్న భూములను గిరిజనులకే అప్పగించాలని గిరిజన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులకు మద్దతుగా మంగళవారం కొత్తూరు మండలం మెట్టూరు గిరిజన భూములు ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభ ర్యాలీలో పలు మండలాల నుండి మద్దతుగా వచ్చిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని వదిలేసి దశాబ్దాలుగా గిరిజనుల సాగులో ఉన్న భూముల్లో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని అధికార యంత్రాంగం సిఫార్స్ చేయడం బాధాకరంగా ఉందన్నారు. అధికార పార్టీ నాయకులకు కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గిరిజనుల భూముల్లో నిర్మాణ పనులు చేపడితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.