దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్యచేసిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుచేసి, చట్ట ప్రకారం శిక్షించాలని దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. మంగళవారం కొవ్వూరు ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే మస్తాన్ మాట్లాడుతూ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ రక్షణ కరువైందనడానికి దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యే నిదర్శనమని, ఆ కేసులో అనంతబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం బాధాకరమన్నారు. బెయిల్ తీసుకుని ఊరేగింపుగా, ర్యాలీగా తీసుకురావడం దుర్మార్గపు చర్య అని అన్నారు. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్ చేయాలని, విచారణ పూర్తిచేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యకేసు నుంచి బయట పడడానికి అనంతబాబు పథకం ప్రకారం ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఈ కేసులో అతడికి శిక్షపడే వరకు దళిత, ప్రజా సంఘాలు పోరాడతాయన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలన్నారు. సీఎం జగన్‌కు దళితులు కావాలో, అనంతబాబు కావాలో తేల్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మెరిపో జాన్‌రాజు, దళిత రక్షణ దళం రాష్ట్ర అధ్యక్షుడు కొడమంచిలి రమణ తదితరులు పాల్గొన్నారు.