తెలంగాణలో టీడీపీ బలపడాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో జరిగిన టీడీపీ శంఖారావంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ "తెలంగాణలో టీడీపీ ఎక్కడ అనేవారికి ఖమ్మంలో టీడీపీ శంఖారావమే సమాధానం. రెండు రాష్ట్రాలను కలిపేస్తామని కొందరు చేతకాని వారు అంటున్నారు. బుద్ధి,జ్ఞానం ఉండేవారు ఇలా మాట్లాడరు. తెలుగు ప్రజలు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండడం రికార్డు. మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు కాబట్టి ఈ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేరు. ఏపీలో గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెట్టే బాధ్యత నాదే. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తాం" అని అన్నారు.