గ్రామీణంలో పాడి పరిశ్రమపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న రైతులు కృష్ణామిల్క్ యూనియన్ సహకారంతో మరింత అభివృద్ధి చెందేలా విదేశీ పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తామని తానా అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి తెలిపారు. బుధవారం హనుమాన్‌జంక్షన్‌లో తానా సహకారంతో కృష్ణా మిల్క్‌యూనియన్ హనుమాన్‌జంక్షన్ పాలశీతల కేంద్రం క్లస్టర్ పరిధిలోని రైతు కుటుంబాలకు కాకాని కల్యాణ మండపంలో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఉత్తమ పాడి రైతులకు 100 చాప్‌కట్టర్లు, 60 పవర్ స్ర్పేయర్లు అందించారు. ఈ సందర్భంగా అంజయ్య చౌదరి మాట్లాడుతు, తానా చైతన్య శ్రవంతి కార్యక్రమంలో భాగంగా నెలరోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డిసెంబరు 7 నుంచి జనవరి 7 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్యశిబిరాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, పలుగ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ‘తానా రైతు కోసం’ కార్యక్రమంలో భాగంగా తమవంతు సాయంగా నేత్ర వైద్యశిబిరంతో పాటు రైతులకు ఉపయోగపడే చాప్ కట్టర్లు, పవర్ స్ర్పేయర్లు అందించడం అనందంగా ఉందన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాడి రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.