ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ బైజూస్ పాఠాలతో బంగారు భవిష్యత్తు సమకూరనుందని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం పెనగలూరు మండల ఆదర్శ పాఠశాలలో ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుల కోసం సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం బైజూస్ పాఠాలతో కూడిన ట్యాబ్ లను 8 వతరగతి విద్యార్థులకు, వారికి బోధించే ఉపాధ్యాయులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులందరూ లక్ష్యాల మేరకు చదువుకొని ఉన్నత స్థితికి చేరుకొని, జీవితంలో స్థిరపడే వరకు మీకు అండగా ఉండేందుకు జగనన్న ప్రభుత్వం అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. తదనంతరం విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్దిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, జెడ్పీటీసీ సుబ్బరాయుడు, తహశీల్దార్ శ్రీధర్ రావు, ఎంపీడీవో వరప్రసాద్, ఎంఈఓ జయవేలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.