ఏపీఎండీసీ మంగంపేట బ్రాంచ్ నందు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, ట్రైనీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 12(3) అగ్రిమెంట్ ప్రకారం ఫిబ్రవరి నాల్గోతేదీ నుండి 535 మంది కార్మికులకు ఇచ్చి న్యాయం చేయాలని మంగళవారం భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలతో నిరసన కార్యక్రమాలు తెలిపారు. నిరసనలు ఈరోజుకి 36 రోజులకు చేరుకున్నాయి. ఈకార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ యండి చెప్పిన 15 రోజులు సమయం అయిపోయిందని, ఆదివారము మంగంపేట బ్రాంచ్ నుండి చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్మికులకు సంబంధించిన లిస్టును విజయవాడ హెడ్ ఆఫీస్ కు పంపించారని, యండి తక్షణం నిర్ణయం తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలన్నారు. చేస్తున్న పనిని బట్టి హోదా కల్పించి జీతం ఇవ్వాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఎపీఎంసీ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ బండారు భాస్కర్, ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ నారదాసు సుబ్బరాయుడు పాల్గొన్నారు.