వైసిపి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ల సంఖ్యను తగ్గించుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.
ప్రతి నెలా ఇచ్చే సామాజిక పింఛన్లను తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తులు పేదలను ఇబ్బందుల పాల్జేసేవిగా ఉన్నాయని తెలిపారు. పెన్షన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారు 4 లక్షల మంది లబ్దిదారులకు నోటీసులు జారీ చేశారని... పేదలైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఇప్పటివరకు పొందుతున్న పెన్షన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అని పవన్ పేర్కొన్నారు.
పెన్షన్ తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సరిగా లేవని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు కూడా నోటీసులు ఇచ్చారని, వారి పేరిట వేల ఎకరాల భూములు ఉన్నాయని ఆ నోటీసుల్లో పేర్కొన్నారని పవన్ ఆరోపించారు. అలాగైతే, ఆ వేల ఎకరాల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆ వృద్ధులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ తన లేఖలో పేర్కొన్నారు.
పెనుకొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే మహిళ పేరిట 158 ఇళ్లు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారని, ఒకవేళ నిజంగానే ఆమెకు అన్ని ఇళ్లు ఉంటే అవి ఎక్కడున్నాయో చూపించి వాటి తాళాలను ఆమెకు అందజేయండి అని సూచించారు. అంతేకాకుండా, విద్యుత్ బిల్లు ఎక్కువైందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో లబ్దిని రద్దు చేయాలని చూడడం విచిత్రంగా ఉందని అభిప్రాయపడ్డారు.
"ఈ విధంగా నోటీసులు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారు. పాతికేళ్ల కిందట చనిపోయిన వారు ఇప్పటికీ ఆదాయపన్ను కడుతున్నారంటూ నోటీసుల్లో చూపించి వితంతు పెన్షన్లు రద్దు చేస్తామంటున్నారు. పది పదిహేనేళ్లకు ముందు నుంచి పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులను, నాడు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను ఇప్పుడు చూపించాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఓవైపు వారి వైకల్యం కళ్ల ముందు కనిపిస్తున్నా పెన్షన్ కు దూరం చేస్తామనడం భావ్యమేనా?
మా పార్టీ చేపట్టే జనవాణి కార్యక్రమంలోనూ ఇలాంటి పరిస్థితులపై అనేకమంది దివ్యాంగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెన్షన్ల రద్దు నోటీసులపై వాస్తవ పరిస్థితులను సరిదిద్దాల్సింది పోయి... "తిట్టండి" అంటూ కలెక్టర్లను ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతను మీరు సరిగ్గా నిర్వర్తించారనే భావిస్తున్నారా? "అవ్వా తాతా" అంటూ రూ.3 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి, ఆ హామీని ఈ విధంగా అమలు చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు.
కాలం గడిచే కొద్దీ పెన్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలి తప్ప, పెన్షన్ సొమ్ము పెంచుతున్నాం కాబట్టి లబ్దిదారుల సంఖ్యను తగ్గించుకోవాలని అనుకోవడం సరికాదు" అని పవన్ కల్యాణ్ హితవు పలికారు.
మీ పాలనలోని ఆర్థిక దివాలాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెన్షన్ల తొలగింపు చేపట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. సామాజిక పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనే ఆలోచన విరమించుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు. పెన్షన్లు అందజేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను అంటూ పవన్ తన లేఖను ముగించారు.