ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇష్టారాజ్యంగా పింఛన్ల తొలగింపు ఆపాలి: నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 28, 2022, 08:31 PM

అడ్డగోలు నిబంధనలు, అబద్ధపు నోటీసులతో ఇష్టారాజ్యంగా పింఛన్ల తొలగింపు ఆపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో సామాజిక పింఛనుదారులకు ప్రభుత్వం నోటీసులు పంపిందన్న నేపథ్యంలో  నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.  అధికార పీఠం ఎక్కేందుకు పింఛన్ల పెంపు పేరుతో అవ్వాతాతలు, అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరిచ్చిన హామీలు మర్చిపోయారా? అని లోకేశ్ ప్రశ్నించారు.  


అధికారం చేపట్టిన నాటి నుంచి పింఛన్ల విషయంలో నయవంచనకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రూ.200గా ఉన్న పింఛనును 10 రెట్లు పెంచి రూ.2 వేలు చేసిందని లోకేశ్ పేర్కొన్నారు.  


"కానీ మీరు పెన్షన్ ను రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. అధికారంలోకి రాగానే వయో పరిమితి నిబంధనలతో దాదాపు 18.75 లక్షల పెన్షన్లను రద్దు చేశారు. పెంచాల్సిన పింఛను సొమ్ము పెంచకపోగా, అనేక సంవత్సరాలుగా అందుతున్న పింఛన్లనే రద్దు చేసేందుకు ఇష్టంవచ్చినట్టు నోటీసులు ఇస్తున్నారు. రాష్ట్రంలో 6 లక్షల మందికి పింఛన్లు రద్దు చేయాలనుకోవడం చాలా అన్యాయం. 20 ఏళ్ల నుంచి పెన్షన్లు అందుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు తమ ఆసరా తొలగించి ఉసురు తీయొద్దని వేడుకోవడం మీకు వినిపించడంలేదా సీఎం గారూ? 


శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం మారడికోట పంచాయతీలో సెంటు భూమి లేని నిరుపేదలకు వేల ఎకరాల భూములు ఉన్నాయని పింఛన్లు తొలగించారు. వారికి పింఛన్లు ఇవ్వొద్దులే కానీ... ఆ వేల ఎకరాల్లో 90 శాతం మీరే తీసుకుని 10 శాతం భూములు వారికి ఇప్పించండి చాలు. 


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో రామక్క అనే నిరుపేద మహిళ  ఇందిరమ్మ ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటోంది. ఆమెకు 158 ఇళ్లు ఉన్నాయంటూ మీ ఘనమైన సర్కారు నోటీసులు ఇచ్చింది. మీరు ధ్రువీకరించిన 158 గృహాలు రామక్కకి అప్పగించండి. 


అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమనాపల్లికి చెందిన సత్యశ్రీ భర్త మూడేళ్ల కిందట చనిపోతే, ఆయన ఇప్పుడు పన్ను కడుతున్నారని పింఛను నిలిపివేశారు. మీరు పింఛను ఇవ్వకపోయినా ఫర్వాలేదు... సత్యశ్రీ భర్తను బతికించి తీసుకురండి చాలు! 


పెన్షన్ తొలగించారన్న మనస్తాపంతో చిత్తూరు జిల్లాకు చెందిన శెట్టియార్ గుండెపోటుతో మరణించారు. ఆయన ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా? కాకినాడకు చెందిన శ్రీను సొంతస్థలంలో ఇల్లు కట్టుకున్నాడన్న ఒకే ఒక కారణంతో, పదేళ్ల నుంచి దివ్యాంగులైన పిల్లలకు ఇస్తున్న పింఛను నిలిపివేయడం మానవత్వమేనా ముఖ్యమంత్రి గారూ?


 ఏళ్లుగా పింఛను పొందుతున్న దివ్యాంగులు, వితంతువులు ఇప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరడం విడ్డూరంగా ఉంది. సదరం పత్రాల జారీ నిలిపివేశారు... ఇప్పుడా పత్రాలు తీసుకురావాలంటూ దివ్యాంగులకు నిబంధన పెట్టడం పింఛన్ల కోత వేయడానికేనని స్పష్టమవుతోంది. నిరుపేదలకు లేని కార్లు, పొలాలు, ఇళ్లు, ఆస్తులు ఎలా సృష్టిస్తున్నారో అర్థం కావడంలేదు. కుటుంబంలో ఎవరో ఒకరు ఆదాయపన్ను చెల్లిస్తున్నారని, 300 యూనిట్ల కరెంటు వాడారని నిరాశ్రయులైన వారి పింఛన్లు తొలగించడం దారుణం. 


సీఎం గారూ మానవత్వంతో ఆలోచించండి. అవ్వాతాతల జీవితాలకు వెలుగునిచ్చే చిరుదీపాన్ని ఆర్పే ప్రయత్నం చేయొద్దు. దివ్యాంగులకు ఆసరాగా నిలిచే పింఛన్లను లాక్కోవద్దు. వితంతువుల జీవనానికి చేదోడు అయిన పెన్షన్ కోతతో వారికి గుండెకోత మిగల్చవద్దు. ఆపండి మీ నోటీసులు... వెనక్కి తీసుకోండి మీ దిక్కుమాలిన నిబంధనలు... పెన్షన్ల రద్దును ఆపండి... ఇదివరకే రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరించండి" అంటూ లోకేశ్ తన లేఖలో డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com