ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై బుధవారం తెల్లవారుజామున 23 ఏళ్ల ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను కొన్ని గంటలలోనే అరెస్ట్ చేశారు. ఎత్మాద్పూర్ ఏసీపీ రవికుమార్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. ‘23 ఏళ్ల యువతి నోయిడాలోని ఓ ప్రైవేట్ గార్మెంట్‌లో ఉద్యోగం చేస్తోంది. పని ముగించుకుని ఫిరోజాబాద్‌లోని తన స్వస్థలం ఔరయాకు వెళ్లడానికి యువతి టాక్సీ బుక్ చేసుకుంది. అయితే ఆ టాక్సీ డ్రైవర్ బాధితురాలిని కుబేర్పూర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడికి మరో ఇద్దరిని పిలిచి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాలిని ఎత్మాద్పూర్ దగ్గర ఫిరోజాబాద్‌కు ఆటోలో ఎక్కించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాము. టోల్‌ప్లాజా దగ్గరున్న సీసీ ఫుటేజీ ఆధారంగా టాక్సీ డ్రైవర్‌ను గుర్తించాము. నిందితులు జై వీర్, టిట్టు, చాచాను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నాము. అయితే మరో ఇద్దరు నిందితులు కూడా టాక్సీ డ్రైవర్లే. కేసు దర్యాప్తులో ఉంది. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తాం.’ అని తెలిపారు. బాధితురాల్ని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ రవికుమార్ గుప్తా వెల్లడించారు.