గత రెండేళ్లుగా దలైలామాపై గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చైనా మహిళను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు చైనా మహిళ దలైలామాకు హాని కలుగజేసే అవకాశాలు ఉన్నాయంటూ ఈ ఉదయం నిఘా వర్గాలు హెచ్చరికలు పంపాయి.
ఈ నేపథ్యంలో, బీహార్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ మహిళా గూఢచారి ఊహాచిత్రాలను విడుదల చేశారు. ఆమె వీసా, పాస్ పోర్టు వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, దలైలామా ఆధ్యాత్మిక ప్రబోధనలు నిర్వహించే కాలచక్ర మైదానం వెలుపల అనుమానాస్పదంగా సంచరిస్తున్న చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఆమె పేరు సాంగ్ షావోలాన్ అని గుర్తించారు. ఆమెకు గతంలో వివాహమై విడాకులు తీసుకుందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆమె 2019లోనూ ఓసారి భారత్ వచ్చిందని, తిరిగి చైనా వెళ్లి మళ్లీ భారత్ వచ్చిందని, ఈ పర్యాయం కొన్నాళ్లు నేపాల్ లోనూ గడిపిందని గుర్తించారు. నేపాల్ నుంచి బీహార్ లోని బుద్ధగయ ప్రాంతానికి వచ్చినట్టు తెలిసింది.