టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంలో దురదృష్టవశాత్తు కొందరు మరణిస్తే.. వైసీపీ నాయకులు చావులపై రాజకీయం చేస్తున్నారని, ప్రజలు ఇదేం ఖర్మ అని వ్యాఖ్యానిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆత్మకూరు మండలంలో ఆమె రైతు కోసం పాదయాత్ర నిర్వహించారు. 16 కి.మీ. సాగిన యాత్రలో అడుగడుగునా ప్రజలు ఘనంగా స్వాగతించారు. సింగంపల్లి పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కందుకూరు మృతులకు నివాళులు అర్పించారు. సింగంపల్లి తండా, వై కొత్తపల్లి, పి యాలేరు మీదుగా ఆత్మకూరు వరకు యాత్ర సాగింది. సింగంపల్లిలో అరటి రైతులు, వై కొత్తపల్లిలో టమోటా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.