రోజూ మాదిరిగానే ఆ యువకుడు ఇంటి నుంచి విధులకు బయలుదేరాడు. ఇలా ఇంటి నుంచి బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే ట్రాక్టరు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన సింగుపురం సమీపంలోని నీలం జూట్‌మిల్లు వద్ద మంగళవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే..... గుండు విల్లిపేటకు చెందిన పంచిరెడ్డి లక్ష్మీనారాయరణ (30) అనే యువకుడు శ్రీకాకుళం పెదపాడు రోడ్డులోని వరుణ్ షోరూమ్‌లో సేల్స్ మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం విధులకుగాను బైక్ పై బయలుదేరాడు. సరిగ్గా నీలం జూట్‌మిల్లు సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి నాలుగు నెలల కిందటే వివాహం జరిగింది. ఇంతలోనే విషాదం చోటుచేసుకోవడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు చిన్నమ్మడు, రాముడు కన్నీరుమున్నీరవుతు న్నారు. భార్యను ఓదార్చడం ఎవరి తరంకాలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.