ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను కుప్పంలో అడ్డుకోవడాన్ని బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసారు. సిక్కోలు జిల్లాలో వివిధ ప్రాంతాలలో టిడిపి నేతలు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం రాత్రి ర్యాలీ చేశారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి జీవో పత్రాలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తక్షణం జీవానో రద్దు చేయాలని డిమాండు చేశారు. కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ప్రజల్లో వస్తున్న ఆదరణ అభిమానాన్ని చూసి తట్టుకోలేక వైసీపీ ఈ ఎత్తుగడలకు పాల్పడిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.