టెక్కలి పట్టణంలోని చేరివీధికి చెందిన 70 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కొడుకులు, ఒక కూతు రు. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశాడు. కొడుకులు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. ఇద్దరూ విజయవాడలో ఉంటున్నారు. వృద్ధుడు, భార్య మాత్రం ఊర్లోనే ఉంటూ తమకున్న ఎకరా 13 సెంట్ల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అప్పుడప్పుడూ కొడుకులు వచ్చిపోతుండేవాళ్లు. శుక్రవారం పెద్ద కొడుకు ఊరికి వచ్చాడు. రాత్రి భోజనం చేశాక పొలంలో తన వాటా పంచివ్వాలని కోరాడు. తాను ఉన్నంత వరకు సాగు చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తర్వాత పంచుకోవాలని వృద్ధుడు నచ్చజెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద కొడుకు తండిపై చేయి చేసుకున్నాడు. పదునైన ఆయుధంతో మెడపై దాడి చేశాడు. దీంతో వృద్ధుడి మెడపై తీవ్ర రక్తగాయమైంది. కుటుంబీకులు వెంటనే వృద్ధుడిని టెక్కలి జిల్లా ఆసు పత్రికి తరలించారు. ఘటనపై ఆసుపత్రి సిబ్బంది టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ వృద్ధుడు తాను ఇంటికి వెళ్లిపోతానని, కేసు వద్దని సిబ్బందిని ప్రాధేయపడ్డాడు. ఎందుకని అడిగితే ‘వాడు నా కొడుకే కదా’ అని చెప్పడం అక్కడున్న వారిని కలిచివేసింది.