తిరుమల భక్తులకు షాకిచ్చిలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెరిగింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి రూ. 1000కి పెంచారు. అలాగే, ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3 గదులను రూ. 150 నుంచి జీఎస్టీతో కలిపి రూ 1,700కు పెంచారు. రెస్ట్‌హౌస్ 4లో ఒక్కో గదికి ప్రస్తుతం రూ. 750 వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని 1,700కు పెంచారు. కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ. 2,200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజీల్లో గది అద్దెను రూ. 750 నుంచి 2,800కు పెంచారు.
అద్దె మొత్తాన్ని పెంచడమే కాదు, అద్దెతోపాటు అంతే మొత్తంలో డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ రూ. 1,700 గదిని అద్దెకు తీసుకుంటే అంతే మొత్తంలో డిపాజిట్ అంటే మరో రూ.1700 కలిపి మొత్తం రూ. 3,400ను చెల్లించాల్సి ఉంటుంది. తిరుమలలో ఉన్న 6 వేల గదుల్లో ఇటీవల ఆధునికీకరణ పనులు చేపట్టారు. రూ. 110 కోట్లతో టెండర్లు ఆహ్వానించి ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాల కల్పన అనంతరం అద్దెను భారీగా పెంచారు.
అలాగే, సామాన్య భక్తులు ఎక్కువగా బస చేసే రూ. 50, రూ.100తో లభించే గదుల అద్దెలను కూడా త్వరలో పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ గదుల్లోనూ ఆధునికీకరణ పనులు చేపట్టి, అనంతరం అద్దె పెంపునకు రెడీ అవుతున్నట్టు సమాచారం.