ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై ఉమ్మడిగానే పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. కలిసే ప్రయాణం సాగించాలని నిశ్చయించుకున్నారు. అయితే ఎన్నికల పొత్తులపై ఆ తర్వాత చర్చిస్తామని ఉభయులూ స్పష్టం చేశారు. ఎప్పుడు ఏం చేయాలో తమ వ్యూహాలు తమకు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం దీనిపై మాట్లాడడం సరికాదని.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలూ చెబుతామన్నారు. ఆదివారమిక్కడి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి తొలిసారి వెళ్లిన పవన్.. కుప్పం ఘటనపై ఆయనకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై రెండున్నర గంటల పాటు చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ దమనకాండపై కలిసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటైందని.. న్యాయ పోరాటంతోపాటు ప్రజా ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ వన్ చీకటి జీవో అని.. బ్రిటిష్ కాలం నాటి ఆ చెత్త ఆదేశాలను రాష్ట్రంలో అమలు కానివ్వబోమని, అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.