పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనార్టీలు చురుగ్గా వ్యవహరిస్తే మంత్రి పెద్దిరెడ్డి వారిపై 307 కేసులు పెట్టిస్తూ వేధిస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఇటీవల పుంగనూరులో టీడీపీ బలపడుతూ ముస్లిం మైనార్టీలు అధిక శాతం ఉత్సాహంగా ఉండడంతో ఓర్వలేక పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. 30 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు చేయిస్తూ టీడీపీ వర్గాలను బెదిరించాలని చూస్తున్నట్లు విమర్శించారు. రొంపిచెర్లలో ఫ్లెక్సీల వివాదంపై జరిగిన గొడవలో ఉద్దేశపూర్వకంగా 12 మంది ముస్లిం మైనార్టీలపై 307 కేసులు పెట్టారని మండిపడ్డారు. అలాగే పుంగనూరు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న మైనార్టీ నాయకులు సుహేల్‌బాషా, సద్దాంలపై ఇతరులు జాబితాలో చేర్చి అరెస్టు చేయడం దారుణమన్నారు. బెంగుళూరులో ఉన్న సుహేల్‌బాషా ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి అరెస్టు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ముస్లింలకు ఏదో చేస్తున్నట్లు సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ప్రసంగాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రొంపిచెర్లలో విద్యార్థులపై కూడా అక్రమంగా కేసులు బనాయించారని, ప్రజలు అన్ని గమనిస్తూ తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రొంపిచెర్లలో పోలీసులు తన ఇంటి వద్దకు ఎవర్ని రాకుండా అడ్డుకుంటు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాలన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు పుంగనూరు నియోజకవర్గంలో తప్పుడు కేసులపై తనతో చర్చించారని, బాధితులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారని వివరించారు.