పండుగనెల పెట్టగానే చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో గిత్తలు రంకెలు వేస్తాయి. జల్లికట్టు సంబరాలు మొదలవుతాయి. పండుగ దాటిపోయిన నెల దాకా ఏదో ఒక పల్లెలో ఎద్దులు పరుగులు తీస్తూనే ఉంటాయి. ఇదొక సాహస క్రీడ. గ్రామీణయువతను ఉర్రూతలూగించే ఆట. అయితే ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం జల్లికట్టుపై కత్తిగట్టింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆంక్షలు ప్రకటించింది. జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామంటూ ఏకంగా ఎస్పీ స్థాయి అధికారులే హెచ్చరిస్తుండడంతో సంప్రదాయంగా తరాలుగా జల్లికట్టు నిర్వహిస్తున్న పల్లెల్లో ప్రజలు అయోమయంలో పడిపోయారు.