చిత్తూర్ జిల్లా, రామకుప్పం, మండలంలోని చెల్దిగానిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోని గ్రామ సచివాలయ భవనాన్ని హైకోర్టు ఆదేశాలతో పాఠశాలకు అప్పగించారు. పాఠశాలకు చెందిన స్థలంలో నాలుగేళ్ల క్రితం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించారు. పాఠశాలల ఆవరణల్లో ఎటువంటి ఇతర ప్రభుత్వ భవనాలు కట్టినా అవి పాఠశాలకే చెందుతాయని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ ఏడాది క్రితం స్థానిక సర్పంచు సహా మండలంలోని వైసీపీ శ్రేణులు ఆ భవనాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా, పాఠశాల యాజమాన్యం అడ్డుకుంది. అప్పట్లో వారు పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తరువాతి రోజు రెవెన్యూ, విద్యా, పోలీసు శాఖల అధికారులు, వైసీపీ ముఖ్యులు సమావేశమై భవన విషయమై కేసు కోర్టులో ఉన్నందు వల్ల తీర్పు వెలువడే వరకు ఆ భవనంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రాలు కొనసాగేలా తీర్మానించారు. ఈ క్రమంలో ఆ భవనం పాఠశాలకే చెందుతుందని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బుధవారం ఎంపీడీవో రాధాకృష్ణ చెల్దిగానిపల్లెకు చేరుకుని ఆ భవనాన్ని, భవన తాళాలను ప్రధానోపాధ్యాయుడు మోహనరామలింగం, ఎస్‌ఎంసీ చైర్మన్ జయరామిరెడ్డికి అప్పగించారు. భవనం పాఠశాలకు అప్పగింతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.