చిత్తూర్ జిల్లా, ‘రొంపిచెర్లలో ఘటనకు సంబంధించి కొంత మంది యువకులను మంగళవారం రాత్రి అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వారి తల్లిదండ్రులు నన్ను కలిసేందుకు వచ్చారు. అలాంటప్పుడు మా ఇంటి చుట్టూ మీరు మోహరించడం ఎందుకు’ అంటూ పోలీసులను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి బుధవారం ప్రశ్నించారు. ‘మమ్మల్ని కార్యకర్తలు కలుసుకోరాదా? వారి సమస్యలు చెప్పుకోరాదా? పుంగనూరు నియోజకవర్గంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు’ అంటూ ఆగ్రహించారు. మండలంలో 30 యాక్టు ఉందని, మీ ఇంటి వద్ద ఎక్కువ జనసంచారం ఉన్నందున రోడ్డుపైకి రాకుండా పెట్రోలింగ్ చేస్తున్నట్లు ఐరాల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి 200 మంది పోలీసులు ఎందుకని చల్లా వాదించారు. పోలీసులు డౌన్ డౌన్, అక్రమ కేసులు మానాలంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ చల్లా ఇంటి ఆవరణలోకి వెళ్లారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు.