చోరీకి గురై, వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసిన 116 మొబైల్ ఫోన్లను ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ గురువారం బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అపహరణకు గురైన ఫోన్ల వివరాలను పోలీస్ శాఖ ఇచ్చిన వాట్సప్ నెంబరుకు బాధితులు పంపించారు. వీటిపై దర్యాప్తు చేసి ఇప్పటి వరకూ ఐదు విడతలుగా బాధితులకు 501 సెల్‌ఫోన్లను రికవరీ చేశాం. ఐదో విడతలో 116 రికవరీ చేశాం. వీటి విలువ రూ.25.66 లక్షలు. ఎవరిదైనా మొబైల్ పోతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన నెంబర్‌కు మెస్సేజ్ పెడితే బాధితులకు త్వరితగతిన మొబైల్ అంద జేసేందుకు కృషి చేస్తాం’ అని వివరించారు. గతంలో సెల్‌ఫోన్ చోరీలో అరెస్టు అయిన ఏలూరుకు చెందిన దిమిటి దుర్గారావు, తమ్మిశెట్టి చిరంజీవి, ఇచ్చిన సమాచారం మేరకు వీటిని రికవరీ చేసినట్లు తెలిపారు. మొబైల్ రికవరీలో విశేష కృషి చేసిన సీసీఎస్, సైబర్ క్రైం సిబ్బందిని ఎస్పీ ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందించి అభినందించారు. ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, డీసీఆర్‌బీ సీఐ ఎం.సుబ్బారావు, సీసీఎస్ సీఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.