‘సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా సీఎం జగన్ రైతులకు తీరని ద్రోహం చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధత కారణంగా నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను తెలుగుదేశం అధికారంలోకి రాగానే చేపట్టి పూర్తిచేస్తాం’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. చాట్రాయి మండలం చీపురుగూడెంలో తమ్మిలేరుపై నిర్మించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం–2 ఆక్విడెక్టును గురువారం నూజివీడు, తిరువూరు టీడీపీ ఇన్‌చార్జులు ముద్దరబోయిన వెంకటేశ్వరావు, శావల దేవదత్తులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ‘ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాల మెట్ట భూములను సస్య శ్యామలం చేయడం, వందలాది గ్రామాలకు తాగు నీరందించాలనేలక్ష్యంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో పనులు చేపట్టి రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి 68 శాతం పూర్తిచేస్తే.. వైసీపీ పనులన్నీ ఆపేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని కాపాడాలి’ అని ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ గోపాలకృష్ట, గుత్తా వెంకటేశ్వరావు, పుల్లయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.