సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు, రెవెన్యూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ పలు చోట్ల ఏర్పాటు చేస్తున్న కోడి పందేల బరులను ధ్వంసం చేస్తున్నారు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిర్వాహకులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కైకలూరు పరిధిలోని పందిరిపల్లిగూడెంలో కోడి పందేలు నిర్వహించేందుకు బరుల వద్ద ఏర్పాటు చేసిన కర్రలను తొలగించారు. శృంగవరప్పాడు, ఆలపాడు తదితర గ్రామాల్లో సైతం పోలీసులు, రెవెన్యూ అధికరుల నిఘాను పెంచినట్టు ఇన్‌చార్జి తహసీల్దార్ ఎండీ ఇబ్రహీం తెలిపారు. కైకలూరులో జూదాలు నిర్వహించేందుకు ఏర్పాట్లను నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా పందేలు నిర్వహించే తీరుతామని నిర్వాహకులు బహిరంగంగానే పేర్కొంటున్నారు.