జంగారెడ్డిగూడెం వికాస్ స్కూల్ కరస్పాండెంట్ జగన్నాథరావుపై కేసు నమోదైంది. గతంలో అతనిపై కిడ్నాప్ కేసు ఉంది. స్కూలులో బుధవారం సాయంత్రం సంక్రాంతి సంబరాల నిర్వహణకు పోలీస్ స్టేషన్‌లో రాత్రి 9 గంటల వరకు అనుమతి తీసుకున్నారు. 9 గంటల సమయంలో స్కూల్ వద్ద వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. డీజే సౌండ్స్‌పై ఎస్‌ఐ సాగర్‌బాబుకు ఫిర్యాదందింది. నైట్ బీట్ రౌండ్స్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మోషేను వికాస్ స్కూల్ వద్ద ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని ఎస్‌ఐ ఆదేశిం చారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు పెట్టుకోవాలని, డీజే సౌండ్స్ తగ్గించాలని హెచ్‌సీ సూచించడంతో స్కూల్ కరస్పాండెంట్ ఊరకర్ణం జగన్నాథరావు, మరి కొందరు ఆయనపై దుర్భాషలాడి సంబరాలయ్యే వరకు ఇక్కడికి రావద్దని హెచ్చరిం చారు. ఈ విషయాన్ని హెచ్‌సీ మోషే ఎస్‌ఐకు ఫోన్ లో చెప్పగా నైట్ బీట్ సిబ్బంది మరో ఇద్దరిని తీసుకుని వెళ్లి ట్రాఫిక్‌ను క్లియర్ చేయించి డీజే ఆపించాలని ఆదేశించారు. హెచ్‌సీతోపాటు మరో ఇద్దరు సిబ్బంది తిరిగి వికాస్ స్కూల్ వద్దకు వెళ్లగా జగన్నాథరావు, అనుచరులు మోషేను కిందపడేసి, పక్కనే బాటిల్‌ల్లో వున్న పెట్రోల్ వేసి అగ్గిపెట్టె వెలిగించే ప్రయత్నం చేయగా అదే సమయంలో అక్కడికి వెళ్లిన ఎస్‌ఐ సాగర్‌బాబు, సిబ్బంది అడ్డుకున్నారు. జగన్నాథరావు, చీకటి కిషోర్, ప్రత్తిపాటి శ్రావణ్, కొత్తపల్లి సురేష్, కర్రిప్రోలు సాయి, తిరుమల ధనరాజు, చెప్పుల నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన మోషేను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. మోషే ఫిర్యాదుతో ఎస్‌ఐ సాగర్‌బాబు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు.