జీవో నంబరు 1ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ప్రజాస్వామ్యానికి సంక్రాంతి కానుక అని తెలుగుదేశం పార్టీ అభివర్ణించింది. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి ఆ జీవోను తనకు తానుగా ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ సలహా ఇచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గురువారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యవాదులు ఆనందంతో సంక్రాంతి పండుగ చేసుకొనేలా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసి ప్రతిపక్షాల గొంతు నొక్కే ధ్యేయంతో ఈ జీవో తెచ్చారని ఆరోపించారు.