జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 1 పోలీసు యాక్టు సెక్షన్ 30కి విరుద్ధంగా ఉందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గత 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి జీవోను తీసుకురాలేదని వ్యాఖ్యానించింది. 1861 నుంచి పోలీసు చట్టం అమల్లో ఉందని గుర్తు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఇవే మాదిరి ఉత్తర్వులిస్తే స్వాతంత్య్ర ఉద్యమం జరిగేదా అని ప్రశ్నించింది. గత 75 ఏళ్లుగా రహదారులపై ఎవరూ సమావేశాలు నిర్వహించలేదా అని నిలదీసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్, అడ్వకేట్ జనరల్ (ఏజీ) లేవనెత్తిన ఇతర అంశాల లోతుల్లోకి ఈ దశలో వెళ్లడం లేదని పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ వేశాక వాటిని పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, రోడ్‌షోల నిర్వహణపై నిషేధం విధిస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2న తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తూ వారి గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగంలోని 19(1)(ఎ)(బి) అధికరణకు విరుద్ధంగా ఉన్న ఈ జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ గురువారం సంక్రాంతి సెలవుల ప్రత్యేక బెంచ్‌ను అభ్యర్ధించారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.