‘‘లేపాక్షి, వాన్‌పిక్ తరహా భూ కుంభకోణం నెల్లూరు జిల్లాలో కూడా చోటు చేసుకొంటోంది. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బినామీలకు చెందిన ఒక కంపెనీ రామాయపట్నం పోర్టు ప్రాంతంలో 5,000 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేసే ప్రయత్నం చేస్తోంది. దీనికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘‘నెల్లూరు జిల్లాలో గతంలో సేకరించిన 10,000 ఎకరాల భూమి ఖాళీగా పడి ఉండగా మళ్లీ కొత్తగా ఇన్ని వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమిటి? ఇండో సోలార్ అనే కంపెనీ కేవలం ఏడాది కిందట ప్రారంభమైంది. రూ.లక్ష మూల ధనంతో దీనిని ప్రారంభించారు. ఈ కంపెనీ రూ.33 వేల కోట్లు పెట్టి సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడతామని చెబుతోంది. సీఎం జగన్‌కి సన్నిహితుడైన కడప జిల్లాకు చెందిన నర్రెడ్డి విశ్వేశ్వర్‌రెడ్డి, శరత్‌రెడ్డి, మరొకరు కలిసి ఈ కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ అడిగిందే తడవుగా రామాయపట్నం పోర్టు ప్రాంతంలో 4,800 ఎకరాల భూమిని కారు చౌకగా ఇప్పించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇండో సోలార్ కంపెనీ పెట్టిన విశ్వేశ్వర్‌రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్ చేసే కంపెనీ నడుపుతుంటారు. దానికి అనుబంధంగా ఇప్పుడు ఈ కొత్త కంపెనీ పెట్టారు. ఈ కంపెనీకి ఉన్న అనుభవం, ఆర్థిక స్థోమత ఏదీ పట్టించుకోకుండా వేల ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేస్తారు?’’ అని ప్రశ్నించారు.