వందే భారత్ రైలులోని పగిలిన అద్దాన్ని గురువారం యుద్ధప్రాతిపదికన మార్చారు. ఈనెల 15వ తేదీ నుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ రైలును నడపనున్న సంగతి తెలిసిందే. బుధవారం ట్రయల్ రన్ అనంతరం రైలును కోచింగ్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో అద్దం పగిలిన విషయం తెలిసిందే. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా ప్రారంభించనున్నందున వెంటనే పగిలిన అద్దం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. చెన్నై నుంచి ఆగమేఘాలపై మరొక అద్దం రప్పించారు. ఆ అద్దాన్ని టెక్నికల్ సిబ్బంది అమర్చారు. కాగా, ముగ్గురు వ్యక్తులు రాళ్లు రువ్వి పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. వారిలో ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కోచింగ్ కాంప్లెక్స్‌లోని వందే భారత్ రైలును వాల్తేరు డీఆర్‌ఎం అనూ్‌పకుమార్ శెత్పథి పరిశీలించారు.