రివర్స్ టెండరింగ్ తో పోలవరానికి రివర్స్ గేర్ పడిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమ విమర్శించారు. పోలవరం అంశంలో రాజకీయాలకు అతీతమైన అలౌకిక సంబంధం ఉందని బహిరంగంగా ప్రకటించారని పేర్కొన్నారు. ఆర్థికశాఖ కొర్రీ వేసి రెండేళ్లు దాటినా, సర్కారు చర్యలు శూన్యమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండేళ్లుగా ఏం సాధించారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై దేవినేని ఉమ స్పందించారు.
ఇప్పటికీ డీపీఆర్-2కి దిక్కులేదని, 31 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారని దేవినేని ఉమ ప్రశ్నించారు. 43 నెలలుగా ఢిల్లీ వెళ్లిరావడం తప్ప ఏం సాధించారని సీఎం జగన్ ను నిలదీశారు. అంతేకాదు, ఇవాళ భోగి సందర్భంగా విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ లో దేవినేని ఉమ భోగి మంటలు వేసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి చీకటి చట్టాలను రద్దు చేయాలని కోరుతూ, గ్రామస్తులు, టీడీపీ నేతలతో కలిసి జీవో నెం.1 ప్రతులను భోగిమంటల్లో వేసి దగ్ధం చేసినట్టు వెల్లడించారు.