ఎయిర్ బ్యాగ్స్ కంట్రోలర్లలో లోపం కారణంగా కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి పెద్ద సంఖ్యలో తన కార్లను వెనక్కి పిలిపిస్తోంది. 2022 డిసెంబరు 8వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 12వ తేదీ మధ్య తయారైన కార్ల ఎయిర్ బ్యాగ్స్ కంట్రోలర్లలో లోపం తలెత్తే అవకాశం ఉన్నట్టు మారుతి సుజుకి చెబుతోంది. ఈ లోపం ఉన్న కార్లలో సీట్ బెల్టులు పనిచేయకపోవచ్చని, ప్రమాదం జరిగితే ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవచ్చని గుర్తించారు. అందుకే 17,362 కార్లను మారుతి సుజుకి రీకాల్ చేస్తోంది.
వెనక్కి పిలిపిస్తున్న ఈ కార్లలో గ్రాండ్ విటారా, బ్రెజా, ఆల్టో కే10, ఈకో, బాలెనో, ఎస్ ప్రెసో మోడళ్లు ఉన్నాయి. ఈ మేరకు మారుతి సుజుకి సంస్థ నేడు ప్రకటన చేసింది. రీకాల్ చేసిన కార్లలో లోపం ఉంటే సరిదిద్ది తిరిగి కస్టమర్లకు అప్పగిస్తామని వెల్లడించింది. ఇందుకు ఎలాంటి చార్జీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. కారు తనిఖీ, మరమ్మతులు పూర్తిగా ఉచితమని తెలిపింది.