అధికార పార్టీ భూస్వాముల నుంచి తమను కాపాడాలని మహిళలు డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ కాళ్ళకు దణ్ణం పెట్టి వేడుకున్నారు. పశ్చిమ గోదావరి ఆకివీడు మండలం దుంపగడపలో జరుగుతున్న గడప గడపకు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంచాయతీలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నాని, అయితే కొందరు వైసీపీ నాయకులు అధికార దర్పంతో మా ఇళ్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమను భయపెడుతున్నారని వాపోయారు. తమను ఖాళీ చేయించి ఆ స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే కొన్ని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్మేసుకున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన పీవీఎల్ అక్కడ నివసిస్తున్నవారిని ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులకు సూచించారు. కాగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించి నిరుపేదలకు మంజూరు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారి విస్తరణ లేకపోయినా, అధికారులు ప్రమేయం లేకుండా భూస్వాములు నిరుపేదల ఇళ్లు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.