అనంతపురం జిల్లా, యాడికి మండలం రాయలచెరువులో వింత దొంగతనం జరిగింది. ఉన్న కాస్త పొలంలో కంది పంట వేశాడు. వచ్చిన అరకొర దిగుబడిని వ్యాపారికి అమ్మేశాడు. మొత్తం 2.25 క్వింటాళ్లకు రూ.17,500 వచ్చింది. జేబు లో పెట్టుకుని.. బయటకు వచ్చాడు. అప్పటి వరకూ ఆ రైతు పక్కనే ఉన్న గుర్తుతెలియని వ్యక్తి.. మాటా మాట కలిపాడు. ‘టీ తాగుదాం రా అన్నా..’ అని పిలిచాడు. ఆ తరువాత ‘కందుల బిల్లు సరిగా వేశాడా..? ఏదీ చూద్దాం..’ అని అన్నాడు. దీంతో జేబులో ఉన్న బిల్లును, నగదును రైతు బటయకు తీశారు. డబ్బును లెక్కపెట్టి ఇస్తానని చెప్పి.. అమాంతం లాక్కుని పారిపోయాడు. దీంతో బాధిత రైతు మసూద్‌వలి కన్నీటిపర్యంతం అయ్యాడు. తేరుకున్న తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బాధితుడు రాయలచెరువు బస్టాండ్ పక్కన పూల వ్యాపారం చేస్తుంటాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో ఈ ఏడాది కంది సాగుచేశాడు. ఆరుగాలం శ్రమించి సంపాదించిన సొమ్మును క్షణాల్లో దొంగ దోచుకుపోవడంతో ఆవేదన చెందుతున్నాడు. గుర్తుతెలియని ఆ వ్యక్తి డబ్బులు లాక్కొని ద్విచక్రవాహనంలో పారిపోయాడని, తన సమీప బంధువులకు విషయం తెలిపి అతని కోసం గాలించగా ఎక్కడా కనిపించలేదని తెలిపారు. సీఐ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. సీసీ ఫుటేజీ పరిశీలించి, దొంగను పట్టుకుంటామని తెలిపారు. కాగా, ఇదే మండలంలోని చందన గ్రామంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ హల్‌చల్ చేశారు. దొంగతనానికి వచ్చినట్లు భావించిన గ్రామస్థులు.. వారిని వెంబడించడంతో సమీప తోటల్లోకి వెళ్లి తప్పించుకున్నారు.