మంత్రి ఉష శ్రీచరణ్ అవినీతి, అక్రమాలపై ప్రతిరోజు సినిమా చూపించేందుకు ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి అన్నారు. మంత్రిపై కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ , ఆర్డీవో నిషాంతరెడ్డికి బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇసుక, మట్టి, కొట్టుకుపోయిన వంతెన పైపులను మంత్రి తన భూముల్లో ఏర్పాటు చేసుకోవడం తదితరాలపై ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, పోలీసులను కోరామని అన్నారు. మంత్రి సొంత పార్టీ నాయకులపైనే అక్రమ కేసులు పెట్టించారని, ఇక టీడీపీ నాయకులపై కేసులు పెట్టరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కుమారుడు ఉన్నం ఉదయ్‌భాస్కర్ చౌదరిపై అక్రమ కేసు పెట్టించారని, దీనికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. మంత్రిపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారి బీసీ కులం కార్డును ప్రయోగిస్తున్నారని, వైసీపీ బీసీ నాయకులపై కేసులు పెట్టలేదా అని ప్రశ్నించారు. బీసీ మంత్రి అని గొప్పగా చెప్పుకుంటున్న ఆమె.. బీసీ సామాజికవర్గానికి చెందిన మున్సిపల్ చైర్మనకు కనీస గౌరవం ఇవ్వలేదని, చాంబర్‌లో కుర్చీ కూడా లేకుండా చేసి అవమానించారని విమర్శించారు. కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు ఆర్‌జీ శివశంకర్, టీడీపీ నాయకులు ఉన్నం మారుతీ చౌదరి, రూరల్ మండల కన్వీనర్ గోళ్ల వెంకటేశులు, మాజీ జడ్పీటీసీ కొల్లాపురప్ప తదితరులు పాల్గొన్నారు.