‘రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలి.ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు అందరూ సమష్టిగా కలిసి పోరాడాలని’ టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపు నిచ్చారు. బుఽధవారం స్వర్గీయ ఎన్‌టిఆర్ 27 వ వర్ధంతి సందర్భంగా... మార్టూరులో టీడీపీ పార్టీ కార్యాలయంవద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత పార్టీ జండాను, అనంతరం ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఏలూరి సాంబశివరావు ప్రసంగించారు. రాష్ట్రంలో ఒక వ్యక్తి అవినీతి, డబ్బు ఆశకు రాష్ట్రం బలవుతున్నదని అన్నారు. సమాజం పట్ల బాధ్యతగలిగిన ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలను, నష్టాలను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. జరుగుతున్న నష్టాలతో పాటు, భవిష్యత్తులో జరగబోయే నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి బ్రిటీషు కాలం నాటి జీవో ను ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చూడాలనే ఆశయంతో కార్యకర్తలు పని చేయాలన్నారు. బాపట్ల పార్లమెంట్ సీటును గెలిపించుకోవడంలో పర్చూరు నియోజకవర్గం మొజారిటీ ముందంజలో ఉండాలన్నారు. ప్రజలు కోసం ఎన్ని పోరాటాలనైనా చేస్తామని, మేం ఎవరి జోలికి రాము, మా జోలికి వస్తే మేము ఊరుకోబోమని ఎమ్మెల్యే ఏలూరి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.