సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మూడో రౌండ్ లో ప్రవేశించాడు. నేడు జరిగిన రెండో రౌండ్ పోరులో జకోవిచ్ 6-1, 6-7, 6-2, 6-0తో ఫ్రాన్స్ కు చెందిన ఎంజో కౌకాడ్ పై విజయం సాధించాడు. తొలి సెట్ ను అలవోకగా గెలిచిన జకో... రెండో సెట్ లో కౌకాడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఆ సెట్ టైబ్రేకర్ కు దారితీయగా 5-7తో జకోవిచ్ కోల్పోయాడు. అయితే, ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు చేజిక్కించుకున్న ఈ వరల్డ్ మాజీ నెంబర్ వన్ మ్యాచ్ ను తన వశం చేసుకున్నాడు.
ఇక, పురుషుల సింగిల్స్ లో ఓ మోస్తరు సంచలనం నమోదైంది. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ను అమెరికాకు చెందిన మైకేల్ ఎమ్మో ఇంటిదారి పట్టించాడు. 3 గంటల 26 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఎమ్మో 6-7, 6-4, 6-3, 6-2తో జ్వెరెవ్ పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ లో రెండో సీడ్ ఆన్స్ జాబెర్ కు చుక్కెదురైంది. మార్కెటా వాండ్రసోవాతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో ఆన్స్ జాబెర్ 1-6, 7-5, 1-6తో ఓటమిపాలైంది.
అటు, మహిళల డబుల్స్ లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన తొలి రౌండ్ పోరులో సానియా కజకిస్థాన్ క్రీడాకారిణి డానిలినాతో కలిసి బరిలో దిగింది. సానియా-డానిలినా జోడీ 6-2, 7-5తో గాల్ఫీ-పెరా ద్వయంపై విజయం సాధించి రెండో రౌండ్ లో ప్రవేశించింది.