గుంటూరు, జిల్లాలో భూముల రీసర్వే కార్యక్రమం నిర్దేశించిన సమయంలో పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్‌ని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన భూముల రీ సర్వే, వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో పథకాలు, పేదలందరికి ఇళ్ల పథకం భవన నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో భూముల రీ సర్వే తొలి దశలో జరుగుతున్న గ్రామాల్లో ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. రెండో దశలో సర్వే ప్రారంభించిన గ్రామాల్లో మే నాటికి ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. డ్రోన్ ఫ్లై జరిగి ఓఆర్‌ఐ యాప్‌లు వచ్చినప్పటి నుంచి భూహక్కు పత్రాల పంపిణీ వరకు భూ యజమానుల వివరాలు తప్పులు లేకుండా నమోదయ్యేలా జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రబీలో ఈ క్రాప్ బుకింగ్‌ని పీఎం కిసాన్ ఈకైవైసీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. చిరుధాన్యాల అంతర్జాతీ య సంవత్సరం సందర్భంగా జిల్లాలో ఆయా పంటల సాగు, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పేదలందరికి ఇళ్ల పథకం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, లేఅవుట్లలో ఇళ్ల నిర్మా ణాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించేలా చూడాలన్నారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, జేసీ జీ రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ, డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు, సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు.