మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిజూలకంటి బ్రహ్మారెడ్డిని కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విమర్శలు టీడీపీ శ్రేణుల నుండి వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో మాచర్లలో జరిగిన అధికార పార్టీ విధ్వంసకాండ అనంతరం నియోజకవర్గంలో జూలకంటిని అడుగు పెట్టనివ్వలేదు. అప్పటి నుంచి పట్టణంలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్టు అమలులో ఉన్నాయి. వీటిని 22 వరకు అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మారెడ్డిని మాచర్లలో అడుగుపెట్టనివ్వకుండా పథకం ప్రకారం వీటిని అమలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. మాచర్లలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నా పోలీసు శాఖ 144 సెక్షన్ పొడిగించింది. గత నెలలో మాచర్లలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జూలకంటిని పోలీసులు గుంటూరుకు తరలించారు. బ్రహ్మారెడ్డి సహా టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయగా వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వారికి కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాచర్ల పోలీసు స్టేషన్‌లో సంతకాలు చేయాలన్న విధంగా వారు కండీషన్ బెయిల్ పొందారు. దీంతో వీరు ఇప్పటికే రెండు సార్లు పోలీసు స్టేషన్‌లో సంతకాలు చేశారు. ఈ నెల 22న మరోసారి వారు స్టేషన్‌లో సంతకాలు చేయాల్సి ఉంది. చార్జిషీట్ ధాఖలు చేసే వరకు ఇదే పరిస్థితి నెలకునే అవకాశం ఉంది. కండీషన్ బెయిల్ ఉన్నంత వరకు మాచర్లలో బ్రహ్మారెడ్డి అడుగు పెట్టకుండా ఉండేందుకే పోలీసుశాఖ ఉద్దేశపూర్వకంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నదని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.