అనంతపురం జిల్లా రాయదుర్గం మండల పరిధిలోని మెచ్చిరి గ్రామంలో గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య తలెత్తిన స్థల వివాదం పరస్పర దాడులకు దారి తీసింది. ఇరువర్గాలకు చెందిన 15 మంది దాడుల్లో గాయపడ్డారు. మెచ్చిరి గ్రామంలో టీడీపీకి చెందిన ఆంజినేయులు, శివరాజు, తిప్పయ్య, బసవరాజు, భీమయ్య, కిష్టయ్యపై వైసీపీకి చెందిన ప్రత్యర్థి వర్గంవారు దాడి చేశారు. దీంతో టీడీపీ వర్గీయులు ప్రతిదాడి చేశారు. రెండు వర్గాలకు చెందిన పదిమందికి తీవ్ర గాయాలు, ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని పోలీసులు రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో నెల రోజుల క్రితం కిష్టయ్య ఆధీనంలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఆ సమయంలో ఇరువర్గాలు గొడవపడి, పోలీస్‌స్టేషన వరకు వెళ్లారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పరస్పరం దూషించుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ల వద్దకు వైసీపీ వర్గీయులు వెళ్లి రెచ్చగొట్టారు. దీంతో టీడీపీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ ముదిరి పరస్పరం దాడులు చేసుకునేవరకు వెళ్లింది. ఇరువర్గాలవారు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోడంతో గ్రామం లో ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి వెళ్లి పరిస్థితిన అదుపులోకి తెచ్చారు. గ్రామంలో ఎస్‌ఐ సుమన, సీఐ యుగంధర్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa