మూడున్నర ఏళ్లుగా మనం ఒక సైకోపై పోరాడుతున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు అని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంత సైకో పాలన చూడలేదన్నారు.
ఇదిలావుంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యువ గళం పాదయాత్ర నిర్వహణపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. తొలుత అచ్చెన్న మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువ గళం పాదయాత్ర ప్రారంభిస్తున్నారని అచ్చెన్న పేర్కొన్నారు. పార్టీ యంత్రాంగం మొత్తం యువ గళం యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. మూర్ఖుడి పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని, రాష్ట్రం మళ్ళీ అభివృద్ది పథంలో నడవాలి అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు.
అనంతరం, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు నమస్కారం అంటూ నారా లోకేశ్ ప్రసంగించారు. మూడున్నర ఏళ్లుగా మనం ఒక సైకోపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు అని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంత సైకో పాలన చూడలేదన్నారు.
"ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కార్యకర్తలు, నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారు. అయినా మీరు ఎక్కడా తగ్గలేదు, పోరాడారు. టీడీపీకి బలం కార్యకర్తలు, నాయకులే" అని లోకేశ్ ఉద్ఘాటించారు. మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి లా చేసుంటే వైసీపీ ఉండేది కాదు... ఆ పార్టీ నాయకులంతా ఇతర దేశాలకు పారిపోయేవారు అని పార్టీ నేతల సమావేశంలో లోకేశ్ అన్నారు.
"కానీ మన వాళ్ళు అలా కాదు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పీకుతావో పీకు అని తొడకొట్టారు. పసుపు జెండా కోసం ప్రాణం ఇచ్చే బ్యాచ్ మనది. ప్రజలంతా ఎన్నో ఆశలతో జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 151 సీట్లు ప్రజలు ఇచ్చినందుకు ఎన్నో గొప్ప పనులు చెయ్యొచ్చు. కానీ జగన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు కోసమే అధికారాన్ని వాడుకున్నారు. ఏ వర్గం సంతోషంగా లేరు. జగన్ రెడ్డిపై ప్రజల్లో ద్వేషం కనిపిస్తుంది. మహిళలు, రైతులు, యువత, ఉద్యోగస్తులు ఆఖరికి పోలీసులు కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.
జగన్ రెడ్డి దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. లిక్కర్, సాండ్, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారు. ప్రజలపై భారాన్ని విపరీతంగా పెంచారు. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. విచిత్రం ఏంటంటే, పేద వాడికి అన్నం పెట్టే అన్న క్యాంటిన్ ఎత్తేసాడు. మనం పేదలకు భోజనం పెడతాం అంటే పెట్టనివ్వడు.
వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో జగన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందుకే ఈ మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ రెడ్డి చెత్త పరిపాలన గురించి విమర్శిస్తున్నారు. వార్ ఒన్ సైడ్ అయిపోయింది. ప్రజలంతా మన వైపు ఉన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రాబోతుంది. దీని కోసం మనం అంతా ఇంకా ప్రజలకు మరింత దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం బాదుడే బాదుడు... ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాం.
మీ అందరికి ఆశీస్సులతో త్వరలో నేను యువగళం పాదయాత్ర చేపట్టబోతున్నాను. యువతని జగన్ మోసం చేసాడు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసాడు. విదేశీ విద్య పథకం రద్దు చేసాడు. ఉన్న కంపెనీలను తరిమేసాడు. కొత్త కంపెనీలు రావడం లేదు. ఈ నేపథ్యంలో నేను ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు యాత్ర చేస్తున్నాను. అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా పోరాడతాను. ప్రభుత్వం స్పందించకుంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వేంటనే సమస్యలు పరిష్కరిస్తాం.
400 రోజులు, 4 వేల కిలోమీటర్ల మేర నా పాదయాత్ర సాగుతుంది. మీ సూచనలు, మీ మద్దతు నాకు కావాలి. మన దేవుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను, మన రాముడు చంద్రబాబు గారి విజన్ ని ముందుకు తీసుకెళ్లేందుకు యువగళం మంచి వేదిక కాబోతుంది" అని లోకేశ్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa