శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలం తుంబయ్యపేటకి చెందిన రావాడ లక్ష్మణరావు (53) శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 18న తుంబయ్యపేట నుంచి చల్లవానిపేట ద్విచక్ర వాహనంపై వెళుతున్న లక్ష్మణరావును పాతపట్నం మండలం రోమదల గ్రామానికి చెందిన ఆర్.అమర్నాథ్ తన తండ్రి అస్తికలు శ్రీకూర్మంలో కలిపి తిరిగి బైక్‌పై వస్తుండగా చల్లవానిపేట కూడలి వద్ద వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మణరావుకు తలకు బలమైన గాయం కాగా శ్రీకాకుళం కిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందగా శవపంచనామా చేసి శ్రీకాకుళం జీజీహెచ్‌లో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తెతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే యజమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భార్యతో పాటు తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.