బ్యాంకుల ప్రైవేటీకరణ ఆలోచనను విడనాడాలని, తమ సమస్యలను పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ పిలుపు మేరకు శ్రీకాకుళం సింహద్వారం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘వారానికి 5 రోజుల పనిదినాలు ప్రకటించాలి. పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ అప్‌డేషన్ చేయాలి. మెరుగైన సేవలందించడానికి నియామకాలు చేపట్టాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. వేతన సవరణ కోసం చర్చలు ప్రారంభించాల’ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై చీఫ్ లేబర్ కమిషనర్‌తో ఈనెల 24న చర్చలు సాగుతాయని తెలిపారు. న్యాయం జరగని పక్షంలో ఈ నెల 30, 31 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు ఉపాధ్యక్షుడు జి.కరుణ, కో-ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు గిరిధర్ నాయక్, ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.తేజేశ్వరరావు, వెంకటరమణ, రాము, వాసుదేవరావు, ఎన్‌ఎంకే రాజు, బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.