చిత్తూరు జిల్లా పుంగనూరుకు త్వరలో కేంద్ర బలగాలు రానున్నాయి. రామచంద్రయాదవ్‌కు కేంద్ర ప్రభుత్వం వై ఫ్లస్ కేటగిరి భద్రత కల్పించింది. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ.. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా.. ఆయన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని రామచంద్రయాదవ్ ఆరోపించారు. మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తన ఇంటిపై పెద్దిరెడ్డి అనుచరులు, దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ ఘటన జరిగిన తర్వాత రామచంద్ర యాదవ్ ఈనెల11వ తేదీ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. పుంగనూరులో తన ఇంటి దాడి, హత్యాయత్నంపై ఫిర్యాదు చేశారు. దీంతో త్వరలోనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తానని అమిత్ షా భరోసా ఇచ్చిన ట్టు రామచంద్రయాదవ్ చెప్పారు. ఆయన కలిసిన 10 రోజుల్లోనే హోంశాఖ ద్వారా వై ఫ్లస్ కేటగిరి భద్రత మంజూరు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు కేంద్ర సాయుధ బలగాలు కూడా పుంగనూరుకు చేరుకున్నాయి.
తనకు భద్రత కల్పించినందుకు అమిత్ షాకు రామచంద్రయాదన్ కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు Y+ భద్రత కల్పిస్తుందని వివరించారు. కేంద్ర సాయుధ పోలీసులు, కమాండోలతో ఇంటి వద్ద స్కానింగ్ భద్రత ఉండనుంది. దేశంలో ఎక్కడ పర్యటించినా రామచంద్ర యాదవ్‌కు 24 గంటలు భద్రత కల్పించనున్నారు. గతంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా వై కేటగిరి భద్రత కల్పించారు.