టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్రపై డీజీపీ, ప్రధాన ప్రతిపక్షం మధ్య లేఖల సమరం చోటు చేసుకుంది. పాదయాత్రకు అనుమతి కోరుతూ టీడీపీ లేఖ రాయగా... ఈ యాత్రకు సంబంధించి అనేక వివరాలు అందచేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యుత్తరం పంపారు. గతంలో పాదయాత్రలు చేసిన వారిని ఎవరినైనా ఇవన్నీ అడిగారా అని ప్రశ్నిస్తూ వెంటనే టీడీపీ మరో లేఖ రాసింది. సభలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా... శనివారం ఈ పరిణామం చోటు చేసుకుంది. లోకేశ్ పాదయాత్రకు అనుమతి కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ నెల 9న డీజీపీకి లేఖ రాశారు. శనివారం డీజీపీ దీనికి ప్రత్యుత్తరం పంపారు. యాత్ర అనుమతికి సంబంధించి పలు వివరాలు అందజేయాలని లేఖలో కోరారు.