మా అమ్మను ముగ్గురు కలసి చంపారంటూ కుమార్తె షమ్రీన్ అనే ఆరేళ్ల బాలిక చెప్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం గది వద్ద ఆదివారం చోటుచేసుకుంది. నియోజకవర్గ పరిధిలోని పామూరులో శనివారం రాత్రి అగ్నిగుండాల ఖాజాబి(28) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. తన తల్లిని ముగ్గురు కలసి కొట్టి చంపారని మృతురాలి కుమార్తె చెప్తుండటంతో ఈ ఘటన సంచలనంగా మారింది. మృతురాలి తల్లితండ్రులు చెప్పిన వివరాల మేరకు వారి మాటల్లోనే... మృతురాలి ఖాజాబికి ఏడేళ్ల క్రితం భర్తతో మనస్పర్థలు రావటంతో విడాకులు తీసుకుంది. అప్పట్లో న్యాయస్థానం భర్త నుంచి ఖాజాబీకి రూ.5లక్షలు భరణం కింద ఇప్పించింది. అప్పటినుంచి పామూరులో తల్లితండ్రులకు కూడా దూరంగా, ఒంటరిగా ఉంటుంది. పామూరుకు చెందిన నాయబ్‌రసూల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వివాహం చేసుకుంటానని నాయబ్‌రసూల్ నమ్మించి ఆమె వద్ద ఉన్న ఉన్న రూ.5 లక్షలు తీసుకుని, వాటిని అడిగినందుకు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతిరాలి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బోరున విలిపించారు.