రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వం జీవో - 1 జారీ చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విమర్శించారు. సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టినరోజు సందర్బంగా టీడీపీ నేతలు బోండా ఉమ, కేశినేని చిన్ని భారీ కేక్ కట్ చేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ... యువగళం పాదయాత్రపై జనవరి 9న ప్రభుత్వానికి రూట్ మ్యాప్ ఇచ్చామన్నారు. డీజీపీ తల, తోక లేని ప్రశ్నలు అడుగుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం పాదయాత్రకు ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. సమాచారం ఇస్తే చాలని.... అనుమతి అవసరం లేదని 1861 చట్టంలో ఉందని తెలిపారు. పాదయాత్రకు అనుమతి అవసరం లేదని గతంలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ధర్మాన కూడా చెప్పారన్నారు. ఏదో ఒక కారణంతో పాదయాత్ర ఆపాలని చూస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. తుగ్లక్ ఆలోచనలు విరమించుకుని పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.